Take a fresh look at your lifestyle.

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

0 248

హైదరాబాద్: ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

31న తెలంగాణ కేబినెట్ భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూలై 31వ తేదీ అంటే సోమవారం నాడు మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనుంది. ఇందులో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంనది.రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనుంది. అదే సందర్భంలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనుంది. అంతేగాక, అసెంబ్లీ ఎన్నికలు కూడా మరో మూడు నాలుగు నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలను ప్రభుత్వంవైపు సానుకూలంగా మార్చుకోవడంపైనా చర్చించే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.