Take a fresh look at your lifestyle.

టీఎస్ఆర్టీసీ సరికొత్త టూర్ ప్యాకేజ్: శ్రావణమాసం స్పెషల్

0 278

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. టీఎస్‌టీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పలు పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని ప్యాకేజీలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా- ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది టీఎస్ఆర్టీసీ. ఏపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం, తమిళనాడులోని అరుణాచలానికి ఇప్పటికే స్పెషల్ బస్స్ సర్వీసులు, టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా- మరో ప్రత్యేకంగా మరో టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది టీఎస్ఆర్టీసీ. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వీలుగా దీన్ని రూపొందించింది. శ్రావణమాసంలో ఈ ప్యాకేజీకి ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తోంది. కర్ణాటకలోని గానగాపూర్, మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌లను సందర్శించేలా కొత్త టెంపుల్ పిలిగ్రిమ్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గానగాపూర్‌.. దత్తాత్రేయుడి ఆలయం ఉంది ఇక్కడ. కలబురగి జిల్లా అఫ్జల్‌పూర్ మండలం ఉంటుంది ఈ గానగాపూర్ ఆలయం. గానగాపూర్‌లో దత్తాత్రేయుడిని దర్శించుకున్న అనంతరం పండరీపూర్, తుల్జాపూర్‌‌ ఆలయాలను షెడ్యూల్ చేశారు. ఈ నెల 31వ తేదీన.. మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ స్పెషల్ బస్సు బయలుదేరి వెళ్తుంది. అదే రోజు రాత్రి 11:30 గంటలకు గానగాపూర్‌కు చేరుకుంటుంది. దత్తాత్రేయుడి దర్శనానంతరం మరుసటి రోజు అంటే ఆగస్టు 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు గానగాపూర్ నుంచి పండరీపురానికి ప్రయాణమౌతుంది. సాయంత్రం 4 గంటలకు పండరీపూర్‌కు చేరుకుంటుంది ఈ స్పెషల్ బస్సు. పండరీనాథుడిని దర్శించుకున్న అనంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌కు బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 2వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు తుల్జాపూర్‌కు చేరుకుంటుంది. తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న తరువాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణమౌతుంది. అదే రోజు రాత్రి 8:30 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ఛార్జీ 2,500 రూపాయలు. http://tsrtconline.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ ఓపెన్ అయినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.