హైదరాబాద్: ప్రశ్నించే గొంతులకను ప్రగతిభవన్లో కూర్చొని అణచివేస్తారా? అంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. ప్రజల ఆవేదన, ఆక్రోశం బీజేపీ నేతల అరెస్టులతో ఆగదన్నారు. ప్రజల తరపున బీఆర్ఎస్తో యుద్ధానికి తాము సిద్దమని కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రజల సమస్యల తరపున యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం మొదలైందని.. ఆ యుద్ధాన్ని మీరే(బీఆర్ఎస్) మొదలు పెట్టారని.. తాము సిద్ధంగా ఉన్నామని, శాంతియుతంగా యుద్ధం చేద్దామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రినే అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ గురించి తెలుసుకునేందుకు వెళ్లే హక్కు కూడా కేంద్రంమత్రిగా తనకు లేదని అని ప్రశ్నించారు. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాంపల్లిలోని తమ పార్టీ కార్యాలయం ముందు భారీగా పోలీసుల మోహరింపు ఎదుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తే.. ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదా? అని నిలదీశారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదని.. అలాంటి తనను నేరస్థుడిలా చూస్తూ అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అభద్రతా భావంతో ఉందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగట్లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికీ ఇవ్వడం లేదన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై పోరాడుతుంటే తమను అరెస్ట్ చేస్తున్నారని.. అయినా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
మరోవైపు, కిషన్ రెడ్డి అరెస్టుపై బీజేపీ నేతలు బీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై లోక్సభ స్పీకర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శంషాబాద్ వద్ద కిషన్ రెడ్డితోపాటు రఘునందన్ రావు, ఇతర బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డిని అరెస్టు చేయడంపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని అన్నారు. కాగా, అరెస్ట్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
Prev Post