Take a fresh look at your lifestyle.

భారీ వర్షాలపై జగన్ సమీక్ష

0 258

ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్ఫ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో కలెక్టర్లను అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గోదావరితో పాటు ఇతర నదుల్లో వరద పరిస్దితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ప్రజలు వర్షాలు, వరదల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉందని, రేపు ఇది 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, అవుట్‌ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉందని, ఇది రేపటికి సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత తగ్గుతుందన్నారు. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని సీఎం జగన్ ఆదేశించారు. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలన్నారు. ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పనిచేయాలని, దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఒక్కరూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలన్నారు. వారి పట్ల మానవతాధృక్పధంతో వ్యవహరించాలని, కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలన్నారు. బాధితులకు సహాయశిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలని, శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలన్నారు. సహాయ శిబిరాల నుంచి బాధితులను తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1000లు ఇవ్వాలని ఆదేశించారు. మరో ముఖ్యమైన అంశం కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉండాలని, ఉదారంగా వ్యవహించాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లనుంచి సహాయ శిబిరాలకు వచ్చినవారిని వారిని తిరిగి ఇళ్ళకు పంపించేటప్పుడు వారికి రూ.10వేల రూపాయలు ఇవ్వాలని, ఇది తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుందన్నారు. అలా చేయకపోతే వాళ్లు ఎక్కడికి పోవాలో తెలియదన్నారు.

Leave A Reply

Your email address will not be published.