Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఇచ్చింది మేమే… తెచ్చింది మేమే… పెప్పర్ స్ప్రే బారిన పడిందీ మేమే!: సీఎం రేవంత్ రెడ్డి

0 57
  • పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? అని సీఎం ప్రశ్న
  • ప్రాణహిత – చేవెళ్ల సాధ్యమని కమిటీ చెప్పిందన్న రేవంత్ రెడ్డి
  • మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్ ఆలోచనే అని విమర్శ
  • దోచుకోవాలని… దాచుకోవాలనే దుర్మార్గపు ఆలోచనకు బీఆర్ఎస్ ఒడిగట్టిందని ఆరోపణ

తెలంగాణ ఇచ్చింది మేమే (కాంగ్రెస్)… తెచ్చింది మేమే… పార్లమెంట్‌లో ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పెట్టినప్పుడు పెప్పర్ స్ప్రే బారిన పడింది కూడా తమ పార్టీకి చెందిన ఎంపీలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టుల అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తప్పులను అంగీకరించాలని వారికి సూచించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు.

గతంలో కేసీఆర్ వేసిన కమిటీ ప్రాణహిత – చేవెళ్ల సాధ్యమని చెప్పిందని… కానీ వాస్తవాలతో కమిటీ ఇచ్చిన నివేదికను నాటి ప్రభుత్వం తొక్కిపెట్టేసిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్ ఆలోచనే అన్నారు. కేసీఆర్, హరీశ్ రావులు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని ఆరోపించారు. కానీ ఆ తర్వాత తెలంగాణకు నీళ్లిచ్చిన అపరభగీరథుడు కేసీఆర్ అంటూ ఆకాశానికెత్తారని విమర్శించారు. కేసీఆర్ ఏదో నెమలికి నాట్యం నేర్పినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.

దోచుకోవాలని… దాచుకోవాలనే దుర్మార్గపు ఆలోచనకు బీఆర్ఎస్ ఒడిగట్టిందన్నారు. వారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం వరప్రదాయిని అని చెబుతున్నారని… కానీ తెలంగాణకు ఈ ప్రాజెక్టు కళంకంగా మారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు చెప్పారన్నారు. వాస్తవాలను కూడా తప్పులు అంటూ తప్పించుకునే ప్రయత్నం సరికాదన్నారు. దోచుకోవాలి… దాచుకోవాలనే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు.

హరీశ్ రావును నిలదీస్తున్నా… 

మాజీ మంత్రి హరీశ్ రావును నేను నిలదీస్తున్నాను… ఈ దుర్మార్గాలకు బాధ్యులు మీరు కారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ పాపాలకు కారణం మీరు కాదా? అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోవాలని సూచించారు. ప్రాణహిత ప్రాజెక్టు చేవెళ్లకు మారడానికి కారణం ఎవరు? మరి తమ్ముడు హరీశ్ రావు తప్పు మాట్లాడుతుంటే చేవెళ్ల చెల్లెమ్మ సరిదిద్దవద్దా? అని సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.