Take a fresh look at your lifestyle.

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

0 219

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం
ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది
ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది విపక్ష పార్లమెంట్‌ సభ్యులను ఒకే రోజు సస్పెండ్‌ చేయడం దారుణమని, తానీషా లాగా.. నియంత లాగా దేశాన్ని మోదీ ప్రభుత్వం పరిపాలిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.చరిత్రలో ఇంత దారుణ ఘటన జరుగలేదని, ఇంగ్లీష్‌ వారి పాలనలో కూడా ఇంత దారుణం జరుగలేదని, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఒక చీకటిటి రోజని ఆయన అన్నారు. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌ నాయక్‌, మాజీ ఎంపీలు సురేష్‌ షేట్కర్‌, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంట్‌లో ఈ నెల 13న ఆగంతకులు దూకి సభ్యులపై టీయర్‌ గ్యాస్‌ వొదిలారని, ఈ సంఘటన దేశ పార్లమెంటరీ వ్యవస్థకే ఒక మాయని మచ్చ అని పేర్కొన్నారు. విపక్షాలు అన్నీ కలిసి కూటమిగా ఏర్పడి ఇండియా అని పేరు పెట్టుకుంటే ఆ పదాన్ని కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం రావాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

భారతదేశ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నిస్తే బీజేపీ అనుబంధ సంస్థలు సీబీఐ,ఈడీ, ఐటీ దాడులు చేస్తాయని అన్నారు. తాము తెలంగాణ కోసం పార్తమెంటులో తీవ్ర స్థాయిలో ఆందోళన చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక్కటై నిరసిస్తున్నాయని, బీజేపీ కార్యకర్తలను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకే ఎంపీలను సస్పెండ్‌ చేసిందన్నారు. తాము దేశ భక్తులమని చెప్పుకునే బీజేపీ ఎంపీలు ఈ సంఘటనకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 13వ తేదీన పార్లమెంటులో జరిగిన దాడిపై ఇంతవరకు ఎవరు స్పందించలేదని, బిఆర్‌ఎస్‌ సభ్యులు కూడా దీనిపై ఎందుకు మాట్లాడరని ఆయన విమర్శించారు. గతంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తమంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారా..అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని విలేఖరుల ప్రశ్నలకు పొన్నం జవాబిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన మాటలు మాజీమంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు చెప్పించారా..అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మారిందని, దానికి అగుగుణంగా వారు వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, వారు చేసింది బంగారు తెలంగాణ అయితే ప్రజావాణి నుంచి వేల పిటిషన్లు ఎందుకు వొస్తున్నాయని ప్రశ్నించారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని, 15 రోజుల్లో రివ్యూ చేస్తామని చెప్పామన్నారు. తాము గ్యారంటీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పునరుద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.