- రేపు ఉదయం హైదరాబాద్‌లో అడుగు పెట్టనున్న అమిత్ షా
- గద్వాల, నల్గొండ, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షా
- సికింద్రాబాద్‌లోని ఓ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాలతో సమావేశం
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట తెలిపిన వివరాల ప్రకారం అమిత్ షా ఈ రోజు రాత్రికి హైదరాబాద్ రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రేపు ఉదయం గం.10కు హైదరాబాద్‌లో అడుగు పెట్టనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా గద్వాల సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరవుతారు. ఆ తర్వాత 12 గంటలకు నల్గొండ సభలో, 2 గంటలకు వరంగల్ సభలో అమిత్ షా పాల్గొంటారు.
మూడు సకల జనుల విజయ సంకల్ప సభల అనంతరం అమిత్ షా నేరుగా హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పాటు అన్ని అనుబంధ విభాగాలతో నిర్వహించే జాతీయ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశాల అనంతరం అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్తారు.