హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ సారథ్యంలోని కేంద్రం చర్యలపై ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని అసదుద్దీన్ సూచించారు. అయోధ్య రామమందిర ప్రస్తావన కూడా తెచ్చిన ఆయన.. 500 ఏళ్ల పాటు ఖురాన్ పఠనం జరిగిన ప్రాంతం తమది కాకుండా పోయిందన్నారు. ‘‘మూడు నాలుగు మసీదుల విషయంలో జరుగుతున్న కుట్ర మీకు కనిపించట్లేదా? ఢిల్లీలోని సునెహ్రీ మసీదు కూడా ఈ జాబితాలో ఉంది.
కొన్నేళ్ల పాటు కష్టపడి మనం ఈ స్థాయికి చేరుకున్నాం. ఇలాంటి విషయాలపై మీరు దృష్టి సారించాలి’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ముస్లింలు అందరూ ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. మరి కొన్ని రోజుల్లో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.