నిర్మల్ అసిస్టెంట్ లేబర్ అధికారి సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా వున్నాయి. కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన మహిళ రిజిస్టర్ అయిన కార్మికురాలు. ఆమె ఇటీవల మరణించడంతో తనకు రావాల్సిన రూ.1.30 లక్షల ఆర్థిక సహాయం ఫైల్ ఆమోదం కోసం మృతురాలి కుమారుడు గంగన్న దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఇందుకు రూ. 30 వేలు ఇవ్వాలని ఏ ఎల్ ఓ సాయిబాబా డిమాండ్ చేశారు. చివరికి 25 వేలకు ఒప్పందం కుదిరింది. సోమవారం ఈ మొత్తాన్ని సాయిబాబా తన కుమారుడు దామోదర్ ద్వారా తమ ఇంట్లో స్వీకరిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ లను అరెస్ట్ చేసి కరీంనగర్ కారాగారానికి పంపించినట్లు డి ఎస్ పి రమణ మూర్తి తెలిపారు.