కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే జ్యుడిషియల్ విచారణను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కార్పోరేషన్ నిధులు ఇవ్వలేదని… కానీ కేంద్ర ప్రభుత్వంలోని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్.. ప్రాజెక్టుకు రుణం ఇచ్చిందన్నారు. అంటే కేంద్రమే రుణం ఇప్పించిందని వ్యాఖ్యానించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు కలిసి పని చేశాయని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కాకముందే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీయే అండగా నిలిచిందన్నారు. పవర్, ఇరిగేషన్ కార్పోరేషన్ నిబంధనలు మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణాలు ఇప్పించిందన్నారు. కార్పోరేషన్ పేరుతో ఒక లక్షా 27వేల కోట్ల రుణం ఇచ్చిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ.60వేల కోట్ల రుణం బీజేపీ ఇప్పించిందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి దోచుకోవడానికి లక్షల కోట్ల రుణం ఇచ్చారా? అని ప్రశ్నించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగితే కిషన్ రెడ్డి కనీసం పరిశీలించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితే ఎందుకు విజిట్ చేయలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవడంపై కేసీఆర్ స్పందించలేదని.. కానీ కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టేది లేదన్నారు. రూ.80వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.27 లక్షల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ విచారణ అని కిషన్ రెడ్డి అంటున్నారని… కానీ కేసీఆర్ పై ఇప్పటి వరకు ఎందుకు వేయలేదో చెప్పాలన్నారు.
కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే అంటారని… కానీ ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరపలేదు? అని ప్రశ్నించారు. మద్యం కేసులో కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని నిలదీశారు. మేడిగడ్డ డ్యామేజ్‌పై ఖర్చంతా తిరిగి సంస్థనే భరిస్తుందన్నారు. ఇరిగేషన్‌పై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి 3500 రోజులు పని చేశాయని ఆరోపించారు. ఇరిగేషన్ అవినీతిలో రెండు పార్టీల పాత్ర ఉందన్నారు.