- చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పుకుంటున్నారన్న సజ్జల
- చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శలు
- చంద్రబాబు జైలు నుంచి విడుదలై 14 గంటలు ప్రయాణం చేశారని వెల్లడి
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబుకు గుండె జబ్బు అని తాజా హెల్త్ రిపోర్టులో పేర్కొనడం, ఆ రిపోర్టును చంద్రబాబు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు సమర్పించడం తెలిసిందే. దీనిపై సజ్జల ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు.
బయటికి వచ్చి చికిత్స చేయించుకోండి అని కోర్టు మానవతా దృక్పథంతో ఆదేశాలు ఇస్తే… బయటికి రాగానే 14 గంటలకు పైగా ప్రయాణం చేశారని వెల్లడించారు. అడుగడుగునా కార్యకర్తలు వచ్చే వరకు వేచి ఉంటూ, లేకపోతే కార్యకర్తలు ముందే వచ్చేలా ఏర్పాటు చేసుకుని… సాయంత్రం బయల్దేరితే మరునాటి ఉదయం ఇంటికి చేరుకున్నారని విమర్శించారు. రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా, వారి డాక్టర్లు హైదరాబాదులోనే ఉన్నా… చంద్రబాబు ఇక్కడికి వచ్చి, ఇట్నుంచి హైదరాబాద్ వెళ్లారని సజ్జల వివరించారు.
“ఇలాంటివి చూసినప్పుడు సహజంగానే ఏదో ఒకటి అంటారు. ఏదైనా అంటే మాత్రం బుద్ధుడు అంతటివాడ్ని పట్టుకుని మాటలు అంటారా అని కోపాలు వస్తాయి. సరే హైదరాబాద్ వెళ్లారు… కానీ అక్కడ చేసిందేమిటి? కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్ పొంది రాజకీయ భేటీలు నిర్వహించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చుంటే ఆయన ఏం చేసినా మేం అడగం. ఇప్పుడు కంటికి శస్త్రచికిత్స చేయకపోతే కళ్లు పోతాయని, చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టు నానా యాగీ చేసి బెయిల్ తెచ్చుకున్నారు” అంటూ సజ్జల విమర్శలు చేశారు.
అరెస్ట్ కాకముందు సభల్లో… వయసు తనకో సమస్య కాదన్న చంద్రబాబు… అరెస్టయ్యాక వయసు, వ్యాధులను ప్రస్తావించడాన్ని ఏమనాలని సజ్జల ప్రశ్నించారు.