Take a fresh look at your lifestyle.

2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. అన్ని ఎంపీ సీట్లు గెలిచి బీఆర్ఎస్ సత్తా ఢిల్లీలో చాటుదాం: కేసీఆర్

0 132
  • వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల హవా ఉండదని, ఏకపార్టీ ప్రభుత్వం రాదని జోస్యం
  • తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నామన్న కేసీఆర్
  • రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామన్న ముఖ్యమంత్రి

బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌ హవానే ఉంటుందన్నారు. ఈ జాతీయ పార్టీల హ‌వా కనిపించదన్నారు. 2024 త‌ర్వాత దేశంలో వ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేనని, ఏకపార్టీ ప్ర‌భుత్వం రాదని జోస్యం చెప్పారు.

లోక్ సభ ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాలను మ‌నం గెలుచుకుంటే బీఆర్ఎస్ త‌డాఖా అప్పుడు ఢిల్లీలో చూపిద్దామన్నారు. తెలంగాణ‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నామన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్త‌వులు.. అనే తేడా లేకుండా అన్ని మ‌తాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని పోతున్నామన్నారు. అంద‌ర్నీ స‌మానంగా ఆదరిస్తున్నామన్నారు. ప్రతి పథకంలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు. అన్ని మ‌తాల వారిని స‌మానంగా చూస్తున్నామన్నారు.

ఈ పదేళ్ల కాలంలో ఒక్క‌సారి కూడా క‌ర్ఫ్యూ లేదని, కల్లోలం లేదన్నారు. బ్ర‌హ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నామన్నారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. 100 ఉత్త‌రాలు రాశాను కానీ ఒక్క‌టంటే ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వలేదన్నారు.

జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలని చట్టం చెబుతోందని, కానీ మనకు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదన్నారు. పైగా రైతుల పొలాల్లో మీటర్లు పెట్టాలని చెబితే తాను ససేమీరా అన్నానని చెప్పారు. దీంతో అయిదేళ్లకు రూ.25 వేల కోట్లు కోత విధించారన్నారు. బడ్జెట్ కట్ చేసిన, నవోదయ, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్‌ ముంచితే, బీజేపీ పదేళ్ల నుంచి కృష్ణాలో మ‌న వాటా తేల్చడం లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.