- మంటల్లో కాలిపోయిన ఐదు హౌస్ బోట్లు
- శనివారం తెల్లవారుజామున ప్రమాదం
- ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదన్న అధికారులు
శ్రీనగర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ లేక్ లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నీటిపై నిలిపి ఉంచిన ఐదు హౌస్ బోట్లు కాలిబూడిదయ్యాయి. భారీగా ఎగసిపడ్డ మంటలు పలు ఇతర బోట్లకు కూడా అంటుకున్నాయని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి మంటలు ఆర్పామని, అయితే ఐదు బోట్లు మాత్రం పూర్తిగా తగలబడి పోయాయని వివరించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా.. ప్రాణ నష్టం జరిగిందా? అనే వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
దాల్ లేక్ లోని ఘాట్ నెంబర్ 9 వద్ద నిలిపి ఉంచిన ఓ హౌస్ బోట్ లో తొలుత మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మిగతా బోట్లకు పాకాయని వివరించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.