- పీర్జాదిగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న వర్ష
- నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బాత్రూంలో చున్నీతో ఉరి
- రెండు గంటలకు తమకు సమాచారం అందించారంటున్న తల్లిదండ్రులు
- తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్యకు పాల్పడిందన్న ప్రాథమిక నిర్దారణ
హైదరాబాద్ శివారు పీర్జాదిగూడలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వర్ష ఆత్మహత్యకు పాల్పడింది. బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వర్ష మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని వర్ష ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
వనపర్తికి చెందిన వర్ష హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు, వర్ష ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఘటన జరిగితే రెండు గంటలకు ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.