Take a fresh look at your lifestyle.

మంగళగిరిని నెం.1గా చేద్దాం… కలసిరండి!: తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేశ్ భేటీలు

0 322

గత ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమిపాలైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే యువగళం పాదయాత్ర ముగించుకున్న లోకేశ్… గత కొన్ని రోజులుగా తన మంగళగిరి నియోజకవర్గంపై దృష్టి సారించారు. వరుసగా నియోజకవర్గంలోని వివిధ రంగాలకు చెందిన తటస్థ ప్రముఖులను కలుస్తున్నారు.

ఇవాళ కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి స్వయంగా తటస్థ ప్రముఖుల వద్దకు వెళ్లారు. మంగళగిరిని రాష్ట్రస్థాయిలో నెం.1గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, అందరూ తమవంతు సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని లోకేశ్ వారికి వివరించారు.

లోకేశ్ మొదట ఉండవల్లికి చెందిన కాపు సామాజికవర్గ ప్రముఖుడు శింగంశెట్టి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శింగంశెట్టి వెంకటేశ్వరరావు… వెంకటేశ్వర ఫైనాన్స్, సీఫుడ్స్, రెస్టారెంట్ వంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవల్లి పట్టణ వాసులకు సుపరిచితులుగా ఉన్నారు.

ఆయనను కలిసిన సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అన్ని సామాజికవర్గాల వారికి చెందినదని, సమాజంలో అందరూ ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే అన్న ఎన్టీఆర్ నాడు టీడీపీని స్థాపించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్లు ఖర్చు చేయడంతో పాటు కాపు భవనాలకు నిధులు, విదేశీ విద్య అమలు చేశారని తెలిపారు. అదేవిధంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కూడా లోకేశ్ గుర్తు చేశారు. కాపుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.

అనంతరం, తాడేపల్లి 17వ వార్డుకు ప్రముఖ వైద్యుడు డాక్టర్ పలగాని శ్రీనివాసరావును ఆయన నివాసంలో కలిశారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పలగాని శ్రీనివాసరావు నిమ్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తాడేపల్లి రోటరీ క్లబ్ లో కీలకసభ్యుడిగా ఉంటూ సామాజికసేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.

డాక్టర్  శ్రీనివాసరావుతో భేటీ తర్వాత లోకేశ్ 15వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆంధ్రప్రభ పాత్రికేయుడు తాడిబోయిన నాగేశ్వరరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. యాదవ సామాజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు గత పాతికేళ్లుగా తాడేపల్లిలో టీచర్ గా, విలేకరిగా సుపరిచితులు. ప్రస్తుతం ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆయనతో భేటీ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాత్రికేయుల గొంతు నొక్కే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో  అందరినీ తాము సమానంగా గౌరవించామని చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా లోకేశ్ ఆయా తటస్థ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.