Take a fresh look at your lifestyle.

నాంపల్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్

0 326
  • ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న మంత్రి
  • బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన
  • మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
  • అగ్ని ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
  • పరారీలో ఇంటి యజమాని రమేశ్ జైశ్వాల్.. గాలిస్తున్న పోలీసులు

నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారి పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మంత్రి తలసానితో కలిసి ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వార్త తెలిసి షాక్ కు గురయ్యానని మంత్రి చెప్పారు. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ యజమాని రమేశ్ జైశ్వాల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కెమికల్ డబ్బాలను నిల్వ చేయడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. బిల్డింగ్ యజమాని రమేశ్ జైశ్వాల్ కు సిటీలో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, అక్కడ తయారైన పలు కెమికల్స్ ను ఈ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో నిల్వ చేస్తున్నాడని వివరించారు. ప్రమాదవశాత్తూ గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. ఫస్ట్ ఫ్లోర్ లోని కెమికల్ డబ్బాలకు నిప్పంటుకుని మంటలు భారీ ఎత్తున ఎగసి పడ్డాయని వివరించారు. దీంతో 2, 3 అంతస్తులలో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారని చెప్పారు. ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది చనిపోయారని చెప్పారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి.. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వివరించారు. నివాస సముదాయంలో రసాయనాలను నిల్వ చేసే పరిస్థితి ఎందుకొచ్చిందనేది విచారిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.