తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఆయనతోపాటు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు కూడా వెళ్తారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలతో సీఎం సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను గురించి వివరిస్తారు.
రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమవుతుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈసారి వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ‘లైఫ్ టు లైఫ్-సైన్స్ ఇన్ యాక్షన్’ అంశంతో ఐదు రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి. కేంద్రమంత్రులు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు.