- నిన్న జరిగిన సెమీస్ లో కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా
- క్రీడా స్ఫూర్తికి కోహ్లీ ఉదాహరణ అన్న మోదీ
- షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబు
ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఐసీసీ మెగా టోర్నీలో ఫైనల్స్ కు చేరిన టీమిండియాపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. 7 వికెట్లను కూల్చి మహ్మద్ షమీ కివీస్ ను మట్టికరిపించాడు. టీమిండియా ప్రదర్శనకు ప్రధాని మోదీ కూడా ఫిదా అయిపోయారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, షమీలపై ప్రశంసలు కురిపించారు.
వన్డేల్లో కోహ్లీ తన 50వ సెంచరీని సాధించడమే కాక… అత్యుత్తమ క్రీడాస్ఫూర్తికి, పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడని మోదీ ప్రశంసించారు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం అతని అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్ తరాలకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్ ను నెలకొల్పుతూనే ఉన్నాడని కొనియాడారు. ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ ప్రతిభను కనపరిచిన షమీకి అభినందలను తెలుపుతున్నానని చెప్పారు. షమీ ఎంతో బాగా ఆడాడని… ఆయనను భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తాయని అన్నారు.