Revanth Reddy: ఓటుకు నోటు కేసులో ఆయన వల్లే జైలుకు వెళ్లానన్న రేవంత్ రెడ్డి…. బ్రోకరిజం చేయవద్దని చెప్పానన్న ఎర్రబెల్లి
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని యశస్విని రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసులో తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి కారణమన్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడేందుకు కూడా ఆయనే కారణమన్నారు. ఎర్రబెల్లి వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మకద్రోహి అని ఆరోపించారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రూ.360 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే దానిని రూ.700 కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్న దొంగ ఎర్రబెల్లి అన్నారు.
ఓటు ద్వారా పాలకుర్తి ప్రజలు ఎర్రబెల్లికి బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రావుల పాలన పోవాలంటే ఎర్రబెల్లి ఓడిపోవాలన్నారు. పాలకుర్తి కోసం ఎన్నారై ఝాన్సీరెడ్డి అమెరికాలో పోగు చేసిన డబ్బు ఇక్కడ ఖర్చు చేస్తుంటే ఎర్రబెల్లి మాత్రం ఇక్కడ సంపాదించిన కోట్లాది ఆస్తులను అమెరికాలో పెడుతున్నారన్నారు. నలభై ఏళ్ల ఎర్రబెల్లి రాజకీయ జీవితంలో అక్రమ సంపాదనలే తప్ప ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు.
ఎర్రబెల్లి కౌంటర్
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఎర్రబెల్లి అంతే స్థాయిలో తిప్పికొట్టారు. రేవంత్ ఐటమ్ సాంగ్ లాంటి వాడని, ఆ విషయం టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానన్నారు. చంద్రబాబు కూడా దీనికి అంగీకరించారన్నారు. పాలకుర్తి ప్రజల్ని రేవంత్ అవమానించాడని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ దగ్గరకు వచ్చిన వారిని రేవంత్ కాళ్లతో తన్నాడని ఆరోపించారు. అందుకే రేవంత్‌ను, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ రాజకీయాల్లోకి రాకముందు పెయింటర్ గా పని చేసేవాడని, బ్లాక్ మెయిల్ చేసి ఈ స్థాయికి ఎదిగాడని ఆరోపించారు. పదికోట్ల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చాడని బయట చర్చ సాగుతోందన్నారు. దందాలు, బ్రోకరిజం చేయవద్దని టీడీపీలో ఉన్నప్పుడే ఆయనకు చెప్పానన్నారు. ‘దయన్న లెక్క నీతి, నిజాయతీతో ఉంటే బతకలేమని’ అప్పుడు రేవంత్ చెప్పారన్నారు. తాము తెలంగాణ కోసం రాజీనామా చేస్తే రేవంత్ మాత్రం చేయలేదన్నారు.