- ‘కోతలరాయుడు’ను నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ
- హీరోయిన్ గా జయసుధ చేయవలసిందని వెల్లడి
- మంజు భార్గవి పాత్రకి జయమాలినిని అనుకున్నట్టు వివరణ
- ఆ సినిమా సక్సెస్ అయినా లాభాలు రాలేదని వ్యాఖ్య
దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి ఎంతో అనుభవం ఉంది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను నిర్మించిన ‘కోతలరాయుడు’ సినిమాను గురించి అందులో ప్రస్తావించారు. “నేను సినిమా తీయడం మా నాన్నగారికి ఇష్టం లేదు .. తీయడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. అప్పటికే ఫ్యామిలీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది.
డబ్బు బయట నుంచి తీసుకొచ్చాను .. నాకు అనుభవం లేదు గనుక, ప్రొడక్షన్ వైపు నుంచి క్రాంతి కుమార్ గారి సపోర్ట్ తీసుకున్నాను. హీరోగా చిరంజీవి అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. అందువలన ఆయనను తీసుకున్నాము. ఆ సినిమా పేరే ‘కోతలరాయుడు’. హీరోయిన్ గా జయసుధ అయితే బాగుంటుందని అన్నాను. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడం వలన మాధవిని తీసుకున్నాము” అని చెప్పారు.
“ఇక ఈ సినిమాలో మంజు భార్గవి చేసిన పాత్ర కోసం ముందుగా జయమాలినిని అనుకున్నాము. ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. అలా ఆ సినిమాలో జయసుధ – జయమాలిని చేయలేకపోయారు. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అయింది. అయినా ఆ సినిమా వలన నాకు లాభాలు రాలేదు .. నష్టమూ జరగలేదు” అని చెప్పుకొచ్చారు.