Take a fresh look at your lifestyle.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో తిరుమలకు… ఇద్దరు పర్యాటక సంస్థ అధికారుల సస్పెన్షన్

0 107
  • ఎండీ మనోహర్ రావు, ఓఎస్డీ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు
  • ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఈసీ
  • ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19వ తేదీ మూడు గంటల్లోగా నివేదించాలన్న ఈసీ

తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ రావు, ఆయనకు ఓఎస్డీగా పని చేస్తోన్న రిటైర్డ్ అధికారి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు వారు సస్పెన్షన్‌కు గురయ్యారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 15, 16 తేదీల్లో తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు సస్పెన్షన్‌కు గురైన అధికారులు కూడా తిరుమలలో కనిపించారు. వీరిద్దరిపై ఫిర్యాదు రావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి… కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపించారు.

తెలంగాణ సీఈవో నివేదిక ఆధారంగా… తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా వీరిద్దరు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈసీ తేల్చింది. దీంతో ఎండీ మనోహర్ రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఓఎస్డీ సత్యనారాయణను విధుల నుంచి తప్పించారు. నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19వ తేదీ మూడు గంటల్లోగా నివేదించాలని ఈసీ నోటీసులో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.