- హరీశ్ ఎంత బాగా పని చేసినా కేసీఆర్ సీఎం పదవి ఇవ్వరన్న రాజగోపాల్ రెడ్డి
- రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కోవాల్సిన ఖర్మ మాకు లేదన్న హరీశ్
- హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు మంత్రి పదవి ఇవ్వరని హరీశ్ రావు అన్నారని… హరీశ్ రావు ఎంత బాగా పని చేసినా ఆయనకు కేసీఆర్ సీఎం పదవిని ఇవ్వరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన హరీశ్…. రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని పరోక్షంగా సీఎం రేవంత్ గురించి వ్యాఖ్యానించారు.
హరీశ్ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. తన వ్యాఖ్యలను హరీశ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే… తన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటానని హరీశ్ చెప్పారు. మరోవైపు, హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సూచించారు. అయినా హరీశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.