Take a fresh look at your lifestyle.

ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానంటే…: చంద్రబాబు అంశంపై మంత్రి కేటీఆర్ వివరణ

0 101
  • ఏపీ రాజకీయ వైరం కారణంగా హైదరాబాద్‌లో ఆందోళనలు జరిగితే అందరికీ నష్టమని వద్దని చెప్పానన్న కేటీఆర్
  • ప్రచారరథం నుంచి కిందపడటంతో నారా లోకేశ్ తనకు మెసేజ్ పెట్టి వాకబు చేశారన్న కేటీఆర్
  • తాను చంద్రబాబు  ఆరోగ్యం గురించి అడిగినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్
  • లోకేశ్, పవన్ కల్యాణ్, జగన్‌లు తనకు మిత్రులు అన్న కేటీఆర్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేసు-హైదరాబాద్‌లో నిరసనల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. ఓ మీడియా ఛానల్ ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి… చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిరసనలు వద్దని, ఏపీలో చేసుకోమని చెప్పారని, అలా ఎందుకు మాట్లాడారు? అని ప్రశ్నించారు.

దీనికి కేటీఆర్ సమాధానం చెబుతూ… నిన్న ఆర్మూర్‌లో ప్రచారరథంపై నుంచి తాను పడటంతో తనకు స్వల్పంగా గాయాలయ్యాయని, ఆ సమయంలో నారా లోకేశ్ తనకు ఎలా ఉంది? అని మెసేజ్ పెట్టారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని సమాధానం ఇచ్చానన్నారు. అదే సమయంలో చంద్రబాబుగారికి సర్జరీ అయింది కదా ఎలా ఉన్నారు? అని అడిగితే… బాగానే ఉన్నట్లు లోకేశ్ చెప్పారన్నారు. లోకేశ్ తనకు తమ్ముడిలా మిత్రుడని, పవన్ కల్యాణ్, జగన్‌లు కూడా అన్నల వలె తనకు మిత్రులు అన్నారు. తనకు ముగ్గురూ స్నేహితులేనని, వారందరితోనూ సత్సంబంధాలే ఉన్నాయన్నారు. వారితో తనకు ఎలాంటి రాజకీయ వైరం లేదన్నారు. ఎందుకంటే తన రాజకీయ క్షేత్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

అయితే తాను అలా మాట్లాడటానికి గల కారణం ఏమంటే… అక్కడ జరిగిన రాజకీయ వైరం వల్ల జరిగిన ఘటనకు (చంద్రబాబు అరెస్ట్) ఇక్కడ ఆందోళనలు జరిగితే అందరికీ నష్టమేనని తాను భావించి వద్దని చెప్పానని తెలిపారు. అయితే ధర్నా చౌక్‌లో ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చునన్నారు. ఏపీలో జరిగిన ఘటనకు ఇక్కడ ఒక పార్టీ నిరసనలు తెలిపితే మరో పార్టీ కంటిన్యూ చేయవచ్చునన్నారు. హైదరాబాద్ అలాంటి రాజకీయ ఆటకు వేదిక కావొద్దనేది తమ ఉద్దేశ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఏపీలో కూడా ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇటీవల ఓ కంపెనీని తాను అభ్యర్థించానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.